సినిమాల పై పవన్ వైఖరి సరైనదేనా?

Leave a Comment

 


భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో...

ముందు చూపుతోనే రాసారో లేక అలా కలిసొచ్చిందో కానీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కొందరికి భైరవుడు ఐతే కొందరికి భార్గవుడు, మరి కొందరికి భాస్కరుడు ఐతే తన సినిమా డైరెక్టర్లకి మాత్రం రక్కసుడు అవుతున్నారు.

కొణిదెల కళ్యాణ్ బాబు, చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస బ్లాక్ బస్టర్స్ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతగా అంటే,  ఒకానొక  సమయంలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నుండి పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయికి.. ఫ్యాన్ ఫాలోయింగ్ లో తనకు సాటి లేదు అనే స్థాయికి. సరే తన ప్రయాణం అంతా తెలిసిందే కాబట్టి దాని గురించి పక్కన పెట్టేసి ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి మాట్లాడుకుందాం.

రాజకీయం, సినిమా అని రెండు పడవల స్వారీ చేస్తున్న పవన్ అటు రాజకీయానికి ఇటు సినిమాకి రెండింటికి న్యాయం చేయలేక సతమతం అవుతున్నారు. పార్ట్ టైం పొలిటిషన్ అని రాజకీయాల్లో ప్రత్యర్థులు దాడి చేస్తుంటే నిబద్ధత లేకుండా సినిమాలు తీస్తున్నాడు అన్న విమర్శ సినిమా ఫాన్స్ నుండి వినపడుతోంది. సినిమా గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే ఇది నిజమేగా మరి అనుకోక తప్పదు.

2019 తరవాత తను తీసిన సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్. ఈ రెండు సినిమాల షూటింగ్ అప్పుడు షూటింగ్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అన్న వార్త వింటూనే ఉన్నాం. కొన్ని సార్లు కరోనా వలన ఐతే కొన్ని సార్లు పవన్ రాజకీయ కార్యక్రమాల వలన. ఇలా అప్పటికప్పుడు షెడ్యూల్స్ మార్చటం వల్ల ప్రొడ్యూసర్ కి వచ్చే నష్టం లక్షల్లోనే ఉంటుంది మరి. కానీ పెద్ద స్టార్ తో గొడవ పెట్టుకోవటం ఇష్టం లేని ప్రొడ్యూసర్లు ఏమి అనలేక వాళ్ళే సర్ది పెట్టుకున్నారు. ఆ రెండు సినిమాలకి పెద్ద స్టార్ కాస్టింగ్ లేకపోవటం కూడా కలిసొచ్చింది పవన్ కి. కానీ ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న హరి హర వీర మల్లు కి మాత్రం ఇది ఇంచు మించు చావు దెబ్బలా తయారయ్యింది. 

ముందుగా అనుకున్న షెడ్యూల్ కి పవన్ అందుబాటులో ఉండకపోవటం వల్ల అది అవ్వకపోగా, పవన్ ఖాళిగా ఉన్న సమయానికి వేరే కాస్ట్ ఖాళిగా ఉండకపోవటంతో ఆ మధ్య ఈ సినిమా షూట్ ఆగిపోయింది. అప్పుడెప్పుడో ఆగిన షూట్ మళ్ళి ఇప్పటికీ మొదలు కాలేదు. రషెస్ బాలేదు, సీన్స్ మార్చాలి, బడ్జెట్ ఇబ్బందులు లాంటి వార్తలు కూడా వింటూ ఉన్నాం కానీ అసలు అనుకున్న షెడ్యూల్స్ సరిగా జరిగి ఉంటే ఈ పాటికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యుండేదేమో. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

పోనీ తరవాత అనుకున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్ అయినా సాఫీగా అవుతుందా అంటే ఇప్పటి వరకు నాన్చుతూ వచ్చి ఇప్పుడు మధ్యలో ఇంకొక రీమేక్ సినిమాని ఇరికించారు. దీనితో, డైరెక్టర్ అయిన హరీష్ శంకర్, ప్రొడ్యూసర్స్ మైత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఉందో లేదో తెలియని పరిస్థితి. ప్రొడ్యూసర్లకి వారు ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తే పెద్ద ఇబ్బంది ఏం లేకపోయినా డైరెక్టర్ కి మాత్రం ఇది పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అని సంవత్సరాలుగా దీని మీదనే కూర్చుని ఉన్నాడు హరీష్ శంకర్. ఇప్పుడు అది లేదు అంటే ఆయన ఇన్నాళ్ల ఎదురుచూపులు వృధా ఐనట్టేగా.

ఇలా తన డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని ఇబ్బంది పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. 

సినిమా అనేది తనకు తన పార్టీకి అన్నం పెట్టేది అని తరచుగా చెప్తూ వస్తున్న హీరో దానికి తగ్గట్టుగా పని చేసినప్పుడు నిబద్ధతతో పని చెయ్యాలి కదా, అలా కాదు అని తినే కంచంలో చెత్త వేసుకుంటే తరువాత ఇబ్బంది పడేది ఆయనే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షూటింగ్ చేయవలసిన హరి హర వీర మల్లు , వినోదాయ సితం రీమేక్ చిత్రాల షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా సినిమాలు, రాజకీయాలు రెండింటికీ మధ్య సమన్వయం కుదుర్చుకుని ముందుకు వెళితే ఆయనకు, ఆయనతో పని చేసే దర్శక నిర్మాతలకు మంచిది.

Similar Links

0 comments:

Post a Comment