VeeraSimhaReddy: వీరసింహుడికి సెన్సార్ ఇబ్బందులు

Leave a Comment

 

Censor issues for Veera Simha Reddy

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా శృతి హాసన్ నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో.. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అందరినీ అలరించబోతున్నట్లు చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది.

అయితే వీరసింహారెడ్డి సెన్సార్ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి నిన్ననే సెన్సార్ పనులు పూర్తి అయ్యాయట. అయితే సినిమాకి సెన్సార్ వారు A సర్టిఫికెట్ జారీ చేస్తాము అనగా దర్శకుడు గోపీచంద్ మలినేని అందుకు ఒప్పుకోలేదట. U/A సర్టిఫికెట్ కావాలి అంటే సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బృందం సూచించిందట. 

అయితే సినిమాలోని ఏ సన్నివేశాన్ని కూడా తొలగించడానికి దర్శకుడు ఇష్టపడకపోవడంతో వీరసింహారెడ్డి సినిమాని రీ సెన్సార్ కు పంపించారని తెలుస్తోంది. జనవరి 9న సెన్సార్ బోర్డుకు చెందిన మరో బృందం సినిమాని చూసి సర్టిఫికెట్ ఇస్తారట. ఇక వీరసింహారెడ్డి నిడివి దాదాపు 175 నిమిషాలు అని అంటున్నారు.

సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో మరో నాలుగు సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కాబోతోంది. అలానే యువ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. 

మరో వైపు తమిళ హీరోలు దళపతి విజయ్ నటించిన వారిసు తెలుగులో వారసుడు పేరుతో ఇదే సంక్రాంతికి వస్తుండగా, మరో హీరో అజిత్ నటించిన ‘తెగింపు’ కూడా సంక్రాంతి రేసులో ఉంది. దాంతో ఈ సంక్రాంతి పోటీ చాలా ఆసక్తిగా ఉండనుంది.

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఇప్పటికే సెన్సార్ పనుల్ని కూడా పూర్తి చేసుకోగా.. ఆ మూవీకి యు/ఏ సర్టిపికెట్‌ని తెచ్చుకుంది. కాగా ఈ సినిమా నిడివి 160 నిమిషాలు అంటే రెండు గంటల నలభై నిమిషాలు.

ఇక వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఒంగోలులో ఈరోజు సాయంత్రం నిర్వహించబోతున్నారు. తొలుత ఎబీఎం కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ నిర్వహణకి సన్నాహాలు చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో నేపథ్యంలో వేదికని త్రోవ గుంట స‌మీపంలోని అర్జున్ ఇన్‌ఫ్రాలోకి మార్చారు.


Similar Links

0 comments:

Post a Comment