సంక్రాంతి కానుకగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఇటీవల విడుదలై మెగా అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందించగా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ సాహిత్యం రాశారు. అయితే ఇందులో కొన్ని పదాల పై ఓ సాహితీ ప్రముఖుడు చేసిన విమర్శలను ప్రముఖ రచయిత, మెగాస్టార్ చిరంజీవిని నవలా నాయకుడిగా తీర్చిదిద్దిన యండమూరి వీరేంద్రనాథ్ సమర్థిస్తూ, తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యండమూరి వ్యాఖ్యలకు రచయిత చంద్రబోస్ సమాధానం ఇచ్చారు. చంద్రబోస్ ఇచ్చిన కౌంటర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఇంతకూ యండమూరి సోషల్ అకౌంట్ లో పోస్ట్ చేసిన విమర్శ ఏమిటంటే, ”తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడే వీడు.. తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే!” ఈ పదాలు రాసిన వారు ఎవరో కానీ అతడెందుకు రాశాడు? అతనికి ఏ సంప్రదాయం తెలుసు? ఏ పురాణ గాథలు చదివాడు?” అంటూ పేర్కొన్నారు. ”త్రినేత్రుడు అంటే శివమహాదేవుడు, ఆయన తిమిర నేత్రం అంటే చీకటి కన్ను! ఏ అర్థం తీసుకున్నా.. అది శివ దూషణే” అని పేర్కొన్నారు. అలాగే ఏ తుఫాను అంచున వశిష్ఠ మహర్షి తపస్సు చేశారో చెప్పు నాయనా అంటూ మరో ప్రశ్ననూ సంధించారు. యండమూరి సోషల్ మీడియా అక్కౌంట్ లో చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు సమర్థించారు. అలాగే మరికొందరు గీత రచయితను అవహేళన కూడా చేశారు. కొంతమంది మాత్రం ‘సినిమాలో కథ ప్రకారంగా ఈ పాటని రాసి ఉండొచ్చు’ అంటూ వివరణ ఇచ్చారు.
అయితే ఈ వ్యవహారం పై చంద్రబోస్ స్పందిస్తూ, ‘ఇది విరోధాభాసాలంకారం. పైకి వ్యతిరేకంగా కనిపించే పదాలు చోటు చేసుకున్నా.. వాటి మధ్య నిగూఢమైన అర్థం ఉంటుందని, అది తెలియని రచయితలు ఎవరూ ఉండర’ని అన్నారు. అలాగే తనకు విరోధాభాస అలంకారం గురించి తెలుసునని, తెలిసే ఈ పద ప్రయోగాలు చేశానని, ఆయన తన రచనను సమర్థించుకున్నారు. యండమూరి తన పోస్ట్ లో ‘తిమిరమంటే ఈ రచయితకు తెలుసా?’ అన్న మాట తనకు బాధ కలిగించిందని చంద్రబోస్ తెలిపారు. ”తిమిరమంటే చీకటి అనే అర్థం తెలియని రచయిత ఉంటాడని, ఒక రచయిత గురించి ఇంకో రచయిత అనుకోవడమే తిమిరం. అంతకంటే తిమిరం మరొకటి లేదు” అని చంద్రబోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మొత్తానికి ఈ వివాదంలో ఈ అలంకారాలు వ్యాసాల విషయంలో ఇరు రచయితల సందేహాలు, సమాధానాలు ఎలా ఉన్నా.. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ కు మరియు సినిమాకు మరింత ప్రచారం జరుగుతోందని కొందరు అంటున్నారు. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ లాంటి అనుభవజ్ఞులు ఇలాంటి విషయలో కాస్త అతిగా స్పందించారు ఎమో అని మరి కొందరు అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే చిరంజీవి గురించి, లేదా ఆయన కుటుంబం గురించి యండమూరి గారు ఇలా వ్యతిరేకంగా మాట్లాడటం ఇదేమి కొత్త కాదు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకునే ఆయన ఇప్పుడు వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ విషయంలో ఇలా తప్పులు వెతికి ఉండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
0 comments:
Post a Comment