ఏపీలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ రగడ

Leave a Commentనీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి, వాటిని నువ్వు ఒక వస్తువు మీదో లేక ఒక పని మీదో పెట్టి రెండు వేలు సంపాదించావ్. సంపాదించిన దానిలో టాక్స్ రూపేణా ఒక మూడు వందలు పోయిందే అనుకుందాం. నీ దగ్గర ఇప్పుడు ఉన్న మొత్తం డబ్బు ఎంత? 


నీ సమాధానం ఏదైనా కానీ నీ దగ్గర ఉన్నది మాత్రం సున్నా అంటుంది మన ఆంధ్రా ప్రభుత్వం. అదేంటి అంటే సంపాదించింది నువ్వే కావొచ్చు, కానీ నేను ఇచ్చేంత వరకు నువ్వు అలానే వేచి చూడాలి అంటుంది. సరే పోనిలే, ప్రభుత్వమేగా, వాళ్ళ టాక్స్ వాళ్ళు కట్ చేసుకుని మనది మనకి ఇచ్చేస్తారులే అనుకుని ఎప్పుడు ఇస్తారు అని అడిగితే, ఆ ఒక్కటి అడగకు అంటుంది ప్రభుత్వం. 


అసలు ఏంట్రా ఇదంతా అంటే గత సంవత్సర కాలంగా నలుగుతూ వేరు వేరు మలుపులు తిరిగి చివరికి సర్దుమణిగిందిలే అనుకున్న టిక్కెట్ల రేట్ల విషయంలో ఉన్న చివరి మెలికని ఇప్పుడు ఆంధ్రా ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. అదే ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్, అంటే ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయించటం. దీని వల్ల కలిగే లాభం ఏంటి అంటే ప్రభుత్వానికి కట్టే టాక్సల ఎగవేతని తగ్గించొచ్చని. దీని మీద ఒక నెల లోపు అగ్రిమెంట్ చేసుకోండి లేదంటే థియేటర్లు మూసేస్తాం అన్న అల్టిమేటం కూడా జారీ చేసారు.


సరే, లొసుగులు ఏమి ఉండవు, ఎవరికి రావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, మంచిదే కదా అనుకునే లోపే ఒక్క టాక్సే కాదు, సినిమాకి వసూలు చేసిన ప్రతి రూపాయి ముందు నేను తీస్కుంటాను, ఆ తరువాత నాకు రావాల్సింది పోగా మిగిలింది నీకు ఇస్తాను అన్న మెలిక పెట్టారు. కొంచం ఇబ్బంది కలిగించేదే ఐనా పోనిలే అనుకుని ముందుకి వెళదాం అనుకుంటే తిరిగి ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తాము అనేదానికి గారంటీ ఇవ్వలేం అంటుంది ప్రభుత్వం.


అసలు పెట్టుబడి పెట్టిన వాడికే డబ్బులు రాకుండా,వచ్చినా ఎప్పుడు వస్తుందో తెలియకుండా పెట్టుబడి పెట్టమనటం ఎంత వరకు న్యాయం అని అసహనంలో ఉన్నారు ఎక్సహిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రా అని వారానికి ఒక వార్త వస్తున్న తరుణంలో ఇలా గారంటీ లేకుండా పెట్టుబడి పెట్టటం అంటే బూడిద లో పోసినా పన్నీరే అనేది వాళ్ళ భయం. అవసరమైతే థియేటర్లు మూసుకుంటాం కానీ దీనికి మాత్రం ఒప్పుకునేది లేదు అని కంకణం కట్టుకుని కూర్చున్నారు. 


ఈ ఇబ్బందిని గమనించిన ఫిలిం ఛాంబర్ ఇప్పుడు ఆ పోర్టల్ ఎదో మేమే చూసుకుంటాం, మీకు దానిలో నిబద్ధతని ఎప్పటికప్పుడు చూసుకునే వీలుని కల్పిస్తాం అని ఆంధ్రా ప్రభుత్వానికి సంకేతం పంపింది. ఈ సందులోనే బుక్ మై షో వాళ్ళు ఇది ఒప్పుకునే తీరులా లేదు అని ప్రభుత్వం మీద కేసు కూడా వేశారు. మున్ముందు ఏమి జరగబోతుంది అనేది పక్కన పెట్టేస్తే ఈ విషయాన్ని ఇంత నాన్చుతున్న ప్రభుత్వ తీరుని చూసి సగటు సినీ ప్రేక్షకుడు విస్మయానికి గురవుతున్నాడు. ఏడాదికి వేయి కోట్ల టర్నోవర్ కూడా లేని ఇండస్ట్రీకి, దానిలో ఇరవై శాతం కూడా రాని టాక్స్ గురించి ఎందుకు ఇంత పట్టుదల అనేది వారి బుర్రకి అర్థం కానీ విషయం.


ప్రేక్షకుల సంగతి పక్కన పెట్టేసినా డిస్ట్రిబ్యూటర్లు, ఎక్సహిబిటర్లు లాంటి వందలాది కుటుంబాలు సినిమా అనే మీడియం మీద బ్రతుకుతున్నారు. అసలే కరోనా పుణ్యమా అని దాదాపు సంవత్సర కాలం పాటు తీవ్ర ఇబ్బందులకు గురైన వాళ్లకి తక్కువ రేట్లు అని మొన్నటి దాక ఒక ఇబ్బంది ఐతే ఇప్పుడు డబ్బులే ఎప్పుడు వస్తాయో తెలియక వేచి చూడాల్సిన పరిస్థితి. 

అమ్మ పెట్టాపెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్టు తయారయ్యింది ఆంధ్రాలో సినిమా ఎక్సహిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి.

Similar Links

0 comments:

Post a Comment