పెంచితినమ్మా Ticket rate…తగ్గిస్తినమ్మా Ticket Rate…

Leave a Comment

రండి బాబూ రండీ, నేడే తగ్గించిన ధరలలో సినిమా చుడండి...

ఇది ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ప్రొమోషన్స్ ట్రెండ్. 

ఒక సగటు సినిమాని దానిలో ఉన్న విషయాన్ని బట్టి పబ్లిసిటీ మానేసి మేము టికెట్ రేట్లు తగ్గించాం, వచ్చి థియేటర్లో చూడండి బాబు అని చెప్పుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి. మేజర్ సినిమాతో మొదలైన ఈ ఒరవడి రేపు రాబోయే పక్కా కమర్షియల్ కి కొనసాగి ఇకపై వచ్చే ఎన్నో సినిమాలకి దర్శనమివ్వబోతోంది. గత నాలుగు నెలల్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో తక్కువ ధరలతో వచ్చిన సినిమా మేజర్ మాత్రమే. ఈ సినిమా స్థాయి కి బాక్స్ ఆఫీస్ దగ్గర బానే వసూలు చేసింది.

అది చిన్న సినిమా కదా, పెద్ద సినిమాలకి కథ వేరేగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒక RRR, KGF మినహా వేరే యే సినిమా కూడా తట్టుకుని నాలుగు వారాలు ఆడింది లేదు.

సరే పోనీ ఇది ఒక కొత్త ట్రెండ్, సినిమాకి వెళ్లకముందే టికెట్ గురించి అంచనా వేసుకోచ్చు కదా అనుకుంటే ఆ ఆనందం కూడా మిగల్చలేదు F3 ప్రొడ్యూసర్లు. మేము టికెట్ ధరలు తగ్గిస్తున్నామండోయ్ అని డప్పు కొట్టి తీరా చూస్తే GO లో పొందు పరిచిన అత్యధిక ధర పెట్టి గవర్నమెంట్ రేట్ అని ప్రేక్షకుడి ఆశల్ని, దానితో పాటు సినిమా కలెక్షన్స్ ని ఆవిరి చేసేసారు.

ఇక మిగిలింది అంటే సుందరానికి సినిమా. ఈ సినిమా రేట్ల చప్పుడు ఎం చేయకుండా థియేటర్లలోకి వచ్చేసింది. అనుకున్నట్టు గానే ఏమి తగ్గించలేదు, కానీ అనుకోని విధంగా ఈ సినిమాకి టాక్ బాగున్నా థియేటర్లో చూసే నాధుడే కరువైపోయాడు. దానితో ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ నేల చూపులు, డిస్ట్రిబ్యూటర్ల లాస్ లు ఆకాశం వైపు చూస్తున్నాయి.

ఇవన్నీ చూస్తున్న చిన్న సినిమా ప్రొడ్యూసర్లు తమ సినిమాలని తక్కువ ధరలకే చూపిస్తే ఎక్కువ ప్రేక్షకులు చూస్తారు అన్న నమ్మకం కుదిరి టికెట్ రేట్లని తక్కువగా పెట్టటానికి మొగ్గు చూపిస్తున్నారా? రాబోయే పక్కా కమర్షియల్ సినిమా ఇదే రూట్ ఫాలో అవుతుందా? ఇది వర్క్ అవుట్ అయితే వచ్చే చిన్న సినిమాలు అన్ని ఇదే పంధా కొనసాగిస్తాయా? వేచి చూద్దాం మరి.

Similar Links

0 comments:

Post a Comment