బాలీవుడ్ మళ్ళీ గట్టెక్కుతుందా?

Leave a Comment

 



పెన్నం మీద నుండి పోయిలో పడటం అంటే ఇదేనేమో

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే స్థాయి నుండి ఇవాళ #BoycottBollywood వరకు వచ్చేసింది మన హిందీ చిత్ర పరిశ్రమ. ఏ పాపం ఎం అయ్యింది బాలీవుడ్ కి అన్న సందేహం వచ్చిందా? అవును అంటే మీ ప్రశ్న లోనే బాలీవుడ్ ని మీరు పట్టించుకోట్లేదు చూసారా అన్న సమాధానం ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే...

గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక విచిత్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది బాలీవుడ్. పెద్ద హీరోల సినిమాలు, పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్, ఫ్రాంచైజ్ లు, ఇలా ఏది తీసుకున్న ఫ్లోప్ కాదు కదా, డిసాస్టర్ లు అవుతున్నయి హిందీ సినిమాలు వరసబెట్టి. పోనీ అన్ని సినిమాలకి ఇదే పరిస్థితా అంటే అదీ కాదు. పుష్ప తో కొట్టటం ప్రారంభించి RRR తో దుమ్ము దులిపేస్తే, KGF2 వచ్చి ఒక తుఫాన్ నే సృష్టించింది. ఇక మరి డబ్బింగ్ కాకుండా సొంత బాషలో తీసిన సినిమాలు చూస్తే ముక్కి మూలిగి 50 కోట్లు కూడా కొట్టట్లేదు. అసలు ఎంటి అని కొంచం తవ్వితే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు బాలీవుడ్ కి కూడా అన్నే ఉన్నాయి.

మొదిటిగా చెప్పుకోవాల్సింది కరోనా గురించి. ఈ మహమ్మారి తీసుకొచ్చిన భయం ఇంకా పూర్తిగా పోలేదు జనాల్లోంచి. ఒకానొక టైంలో ఫామిలీ ఆడియన్స్ థియేటర్ వైపు చూడాలి అంటేనే బెంబేలెత్తిపోయిన పరిస్థితి. అలాంటి అగ్గి కి గాలిలా తోడయ్యింది OTT . ఇంట్లో చక్కగా నలుగురు కూర్చుని రెండు మూడు వారాలకే కొత్త సినిమా తాపీగా చూసుకునే వెసులుబాటు వచేసాక ఇంకా థియేటర్ వైపు ఎవడు మాత్రం చూస్తాడు. దానికి తోడు కొన్ని కొత్త సినిమాలు మంచి రేట్ పలుకుతుండటం తో మొత్తానికి థియేటర్ లో రిలీజ్ లేకుండా OTTకే ఇచ్చేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో అలరిస్తూ ఇదే పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫారం గా తయారయ్యి థియేటర్ బిజినెస్ ని వెనక్కి నెట్టేస్తుంది.

మరి ఇలాంటప్పుడు మళ్ళీ ఆడియన్స్ టిక్కెట్ల కోసం లైన్ లో నిల్చుని కొట్టేసుకోవాలంటే ఎం చెయ్యాలి? కొత్త కంటెంట్ తో రావాలి, లేదా ప్రేక్షకులకి ఏది నచ్చుతుందో అది నీకు నచ్చిన నచ్చకపోయినా తీసి దానికి కొంచం అల్లం వెల్లుల్లిపాయ దట్టించి వాళ్ళ ముందు పెట్టాలి. కానీ మేము మాకు నచ్చిందే తీస్తాం, జనాలు వాళ్ళ స్థాయిని పెంచుకుని మేము ఏది తీస్తే అది చూడాలి అనే విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది బాలీవుడ్ వాళ్ళ ఇంటర్వ్యూల్లో. బదులుగా జనాలు KGF లో హీరో లాగా మాకు నచ్చింది మేము చేస్తాము, మీరు పీక్కుంటు కూర్చోండి అని సరదాగా #BoycottBollywood అనేసారు. ఫలితంగా పెద్ద హీరో సినిమాలు ఐన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ కలిపి డబ్బింగ్ సినిమా ఐన KGF2 మొదటి రోజు చేసిన కలెక్షన్స్ లో సగం చేసాయి.

నిజానికి ఇది మరీ కొత్తగా వస్తున్న మార్పేమి కాదు. గత కొన్నాళ్ళు గా బాలీవుడ్ లో హిట్ల శాతం బాగా పడిపోయింది. అడపా దడపా చిన్న సినిమాలన్నా హిట్ అవుతున్నాయేమో కానీ పెద్ద స్టార్ కాస్ట్ అని చెప్పుకునే సినిమాలు చతికిలపడుతున్నాయి. అర్బన్ ఆడియన్స్ కోసం అనే పేరుతో గాజు భావంతుల్లో కూర్చునే వాళ్ళ కోసం కాదు, మా కోసం సినిమా తీయండి బాబు అని ప్రేక్షకులు ఎప్పటికప్పుడు బాక్స్ ఆఫీస్ రూపం లో చెప్తూనే ఉన్న హిందీ డైరెక్టర్ లు పెడచెవిన పెడుతూనే ఉన్నారు.దానితో వచ్చే సినిమాలని అటు వాళ్ళు చూడక, ఇటు వీళ్ళు చూడక మొత్తానికి వారం లోపే దుకాణం సర్దేస్తున్నాయి.

ఇలాంటి టైంలో సౌత్ సినిమా పైకి రావటం చావు దెబ్బలా తయారయ్యింది బాలీవుడ్ కి. మన మాస్ బిర్యానీ సినిమాలకి భుక్తాయాసంతో ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు, ఎంతలా అంటే డొమెస్టిక్ మార్కెట్ లో మొదటి రెండు సినిమాలు సౌత్ నుండే అయ్యేంత, ఒక చిన్న బడ్జెట్ సినిమా అయిన కార్తికేయ రెండు హిందీ పెద్ద హీరోల సినిమాల రోజు వారి కలెక్షన్స్ ని కొట్టేంత. 

ఇదంతా చూస్తే ప్రేక్షకుల టేస్ట్ ఏంటి అనేది ఇట్టే అర్థం అయిపోతుంది. మరి అంత స్కోప్ ఉన్న హిందీ సినిమా మార్కెట్ కోసం పని చేస్తున్న డైరెక్టర్ లు చెయ్యాల్సిన పని ఏంటి? ప్రేక్షకుడు పాడే పాటకి దరువు వెయ్యటం. కాదు ప్రేక్షకుడు బంగారు కోడి పెట్ట సాంగ్ పాడుతున్నా సరే నేను రాక్ మ్యూజిక్ ఏ కొడతాను అంటే సరే బాబు నువ్వు వాయించుకో అని సగటు ప్రేక్షకుడు #BoycottBollywood అనే అంటాడు.

అలాగని మొత్తంగా హిందీ సినిమాలు పరాజయం అవుతున్నాయి అని కూడా లేదు. ది కాశ్మీర్ ఫైల్స్ వంటి బాధాకరమైన సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఎవరూ ఊహించని స్థాయిలో 300 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అలాగే సీక్వెల్ హైప్ తో వచ్చిన భూల్ బులైయ్యా 2 సినిమా కూడా 250 కోట్ల వరకూ సాధించింది. ఇక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో వరుణ్ ధావన్, సీనియర్ హీరో అనిల్ కపూర్, కియారా అద్వానీ నటించిన జుగ్ జుగ్ జియో భారీ విజయం కాకపోయినా వంద కోట్ల గ్రాస్ ను దాటి పరవాలేదు అనిపించింది. ఇటీవల ఒక సందర్భంలో దర్శక ధీర రాజమౌళి చెప్పినట్లుగా కామెడీ,క్లాస్,మాస్ ఏ సినిమా తీసినా ఆయా.సినిమాల్లో సరైన పాళ్లలో బలమైన కంటెంట్, అందుకు తగ్గ ప్రచారం చేస్తే ఏ సినిమా.అయినా ఏ ఇండస్ట్రీ అయినా విజయపథంలో నడుస్తుంది. అలా కాకుండా ప్రేక్షకులకు దూరంగా ఉంటేనే సమస్య.

Similar Links

0 comments:

Post a Comment