లైగర్ - పూరి should say సారీ

Leave a Comment

హీరో క్యారెక్టర్ ను దూకుడు స్వభావంతో రంగరించి ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అలాగే యాంగ్రీ యంగ్ మాన్ తరహా పాత్రలను చేయడంలో హీరో విజయ్ దేవరకొండ కూడా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేశారు. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే ప్రేక్షకులు సహజంగానే ఆసక్తి చూపారు.

పాటలు అనుకున్నంత ఆకట్టుకోలేకపోయినా, ట్రైలర్ లు పర్వాలేదు అనే స్థాయిలోనే ఉన్నా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ అలరించే విధంగా తెరకెక్కించి ఉంటారని ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. కానీ ఆ నమ్మకాన్ని ఏ మాత్రం నిలబెట్టుకోలేక పోయారు పూరి - విజయ్.

హీరో ను బాక్సింగ్ (MMA) ఛాంపియన్ గా చూడాలనుకునే ఒక తల్లి, అతని తండ్రి కూడా ఒకప్పుడు బాక్సర్.. ఈ లైన్ చూస్తే ఇదివరకు పూరి దర్శకత్వంలో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా గుర్తుకు వస్తుంది కదా.. ఒక రకంగా పూరి జగన్నాథ్ తన సినిమానే మళ్ళీ రిపీట్ చేయాలని చూశారు.

అయితే ఆ ప్రయత్నంలో ఏ ఒక్క దశలో కూడా సఫలం అవ్వలేదు అనే చెప్పాలి. సాధారణంగా పూరి హీరోలు అంటే ఫటాఫట్ డైలాగులు, చితక్కొట్టి ఫైట్లు ఇలాంటి అంశాలు ఉంటాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ల వరకూ బాగానే ప్లాన్ చేసుకున్నా.. మిగతా అంశాల్లో పూరి మార్క్ మిస్ అయింది. హీరోకి నత్తి ఉండటం ఏదో ప్రత్యేకత అనుకున్నారేమో కానీ అది సినిమాకి పెద్ద గుదిబండగా మారింది. మరీ విడ్డూరంగా హీరో నోరు తెరిచిన ప్రతిసారీ నత్తి రావడం మొదట్లో బాగున్నా రాను రానూ భరించలేని విధంగా తయారయింది. ఇక హీరో ఛాంపియన్ గా ఎదిగే క్రమంలో అయినా ఏమైనా ఒడిదుడుకులు ఎదురయ్యాయా అంటే అదీ సరిగ్గా ఉండదు. మొదట్లో ట్రైనింగ్ సన్నివేశాల్లో కాస్త శ్రమ పడతాడు తప్ప ఆ తరువాత హీరోకు ఏ కష్టమూ కలగదు. MMA ఛాంపియన్ గా ఎదిగే వైనం అంతా కేవలం పది నిమిషాల్లో అయిపోతుంది. ఆ తరువాత ఇంటర్నేషనల్ పోటీల్లో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు అవి తీరిపోయే సన్నివేశాలు చూస్తే దర్శకుడు సినిమాను ఎంత తేలికగా తీసుకున్నాడో అర్థం అవుతుంది.

అయితే యాక్షన్ సన్నివేశాలు మాత్రం బాగా డిజైన్ చేసుకున్నారు. విజయ్ ఇంట్రో ఫైట్, అకాడెమీ లో అందరినీ ఎదుర్కునే ఫైట్ రెండూ బాగా వచ్చాయి. ఇక MMA పోటీలలో జరిగే ఫైట్స్ కూడా బాగానే ప్లాన్ చేసుకున్నా.. వాటి ముందు వెనకా జరిగే వ్యవహారం అంతా గందరగోళంగా ఉంటుంది. ఇక ప్రి క్లైమాక్స్ లో విజయ్ తో లేడీస్ ఫైట్ అయితే పూరి పైత్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

ఇక తల్లి సెంటిమెంట్ ఏమయినా ఎమోషన్ పండిందా అంటే అదీ లేదు. మొదట్లో బాక్సింగ్ కోచ్ ను ఒప్పించే సన్నివేశం మినహా.. ఆమె పాత్ర అస్సలు ఆకట్టుకోదు. ఎప్పుడు ఎందుకు అరుస్తుందో అర్థం కాకుండా ఉంటుంది ఆమె పాత్ర చిత్రణ. ఉదాహరణకు హీరో ఎక్కడో విదేశాల్లో పోటీలో పాల్గొంటూ.. ప్రత్యర్థి దెబ్బకి కింద పడితే ఈవిడ గారు టివి ముందు నుంచే రేయ్ ఓయ్ అంటూ అరుస్తుంది. ఆ అరుపుల వల్ల హీరో మెల్కోడం ఎమో కానీ ప్రేక్షకులు మాత్రం ఉలిక్కిపడటం ఖాయం.

ఇక హీరోయిన్ పాత్ర అయితే ప్రతి సన్నివేశంలో ఆమె ప్రవర్తించే తీరుకు ఏదైనా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిందేమో అనే అనుమానం వచ్చేలా ఉంటుంది. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా చిత్త విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆమె పాత్ర. అలాంటి పాత్రకు ప్రి క్లైమాక్స్ లో ఏ మాత్రం అతకని ఒక త్యాగమూర్తి తరహా సన్నివేశం సినిమా ముగించడానికి చేసిన ప్రయత్నంలా ఉంటుంది తప్ప అప్పటి వరకూ నడిచిన తీరుకు 
ఏమాత్రం అతకదు.

ఇక ప్రచారం సమయంలో ఎంతగానో ఉదరగొట్టిన మైక్ టైసన్ ఎపిసోడ్ అయితే అత్యంత పేలవంగా ఉంటుంది. అసలు కనీస స్థాయిలో కూడా బుర్ర వాడని విధంగా ఆ సన్నివేశం ఉండి ప్రేక్షకులు ధియేటర్ నుండి పరుగులు తీసేలా చేసిందంటే అతిశయోక్తి కాదు.

మొత్తానికి ఇండియాని షేక్ చేద్దాం అన్న విజయ్ దేవరకొండ ఆశయం నెరవేరకపోగా.. సినిమా ఫలితం చూసి ఆయనకి , పూరికి షాక్ కొట్టడం మాత్రం ఖాయం. అన్ని రకాలుగా ప్రేక్షకుడిని టార్చర్ పెట్టిన ఈ సినిమాలో పాటలు కూడా తమ వంతు సహాయం అందించాయి.

చివరగా: పూరీ - సారీ 

Similar Links

0 comments:

Post a Comment