కృష్ణంరాజు - కొండెక్కిన అమరదీపం

Leave a Comment

 


ఉప్పలపాటి వేంకట కృష్ణంరాజు - మన రెబెల్ స్టార్ , నిన్న తుది శ్వాస విడిచారు , బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు, ప్రముఖ నిర్మాత మరియు రాజకీయ నాయకుడుగా కృష్ణంరాజు గారి కెరీర్ మరియు ఆయన జీవితం మనందరికీ ఒక ప్రమాణంగా నిలుస్తుంది, ఆ యాభై ఏళ్ల ప్రస్థానాన్ని ఓ సారి గుర్తుచేసుకుందాం


1966లో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి "తేనె మనసులు" సినిమా కోసం ఆడిషన్‌కి వెళ్లి తిరస్కరించబడిన తర్వాత.. చిలకా గోరింక సినిమాకి కృష్ణంరాజు ఎంపికైనప్పుడు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐదున్నర దశాబ్దాల పాటు ప్రయాణం సాగుతుందని బహుశా ఆయనే ఊహించి ఉండరు.




ఆయన తన కెరీర్‌ను తొలి రోజుల్లో పాజిటివ్ పాత్రలతో ప్రారంభించినప్పటికీ, క్రమంగా ప్రధాన పాత్రలలో కూడా సమాంతరంగా నటిస్తూ అనేక ప్రతికూల పాత్రలలో తనదైన శైలిలో నటించి మెరిశారు.

కొత్తదనం కోసం తిరుగుబాటు చేసిన విధంగా ఉండేది --

హీరో, విలన్, మల్టీస్టారర్‌లు.. నిర్మాత ఇలా ఏ బాధ్యత అయినా సరే, ఆయన తన పాత్రలను మరియు కథలను ఎంపిక చేసే పద్ధతిలో కొత్తదనం చూపించడం కోసం పడే తపన ఉత్సాహం, ఆయన పాత్రలు కథలు ఎంచుకోవడంలో చూపించే విప్లవాత్మకమైన ఆసక్తి వల్ల ఆయన అందరిచేత "రెబెల్ స్టార్" అని పిలవబడేవారు


1984లో వచ్చిన కొండవీటి నాగులు సినిమాలో తొలిసారి ఆయన రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాగే డాక్టర్ రాజశేఖర్ కంటే ముందు కృష్ణం రాజునే యాంగ్రీ యంగ్ మ్యాన్ అని కూడా పిలిచేవారు, ఎంచుకున్న టైటిల్స్ మరియు చేసిన పాత్రలు వల్లే ఆయనకు వచ్చిన
స్టార్ ట్యాగ్లు సరిగ్గా సరిపోయాయి అని చెప్పచ్చు.

ఇక కేవలం హీరోగానే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై విమర్శకుల ప్రశంసలు పొందిన పలు చిత్రాలను ఆయన నిర్మించారు.

కాగా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే.. ప్రముఖ హిందీ నటి రేఖ 
నటించిన మొదటి తెలుగు చిత్రం "అమ్మ కోసం"లో ఆవిడ సరసన నటించిన నటుడు మన కృష్ణంరాజు గారే.

ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుని పొందిన మొట్టమొదటి నటుడు కూడా ఆయనే.. అమర దీపం చిత్రానికి గానూ ఉత్తమ నటుడుగా తొలిసారి నిర్వహించిన నంది అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా మొట్టమొదటి నంది అవార్డును అందుకున్నారు కృష్ణంరాజు.


అమరజీవి, కృష్ణవేణి, భక్త కన్నప్ప, కురుక్షేత్రం, అమర దీపం, మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం, బావ బావమరిది, మా నాన్నకు పెళ్లి వంటి సినిమాలు ఆయన కెరీర్ లో అత్యధికంగా విమర్శకుల నుండి ప్రశంసలు పొందిన సినిమాలుగా చెప్పుకోవచ్చు. కాగా నేటికీ ఆ సినిమాల ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తన సినీ ప్రయాణ ప్రస్థానం లో SV రంగారావు, అక్కినేని నాగేశ్వర రావు, NT రామారావు , శోభన్ బాబు, కృష్ణ వంటి తన సమకాల సమ ఉజ్జీలతోనే కాకుండా తరవాతి రెండు తరాల కథానాయకులు అయిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, మురళీ మోహన్, చంద్రమోహన్, జగపతిబాబు శ్రీకాంత్, నితిన్, శివరాజ్ కుమార్, ఉదయ్ కిరణ్, నాని విజయ్ దేవరకొండ వంటి నటులతో పోటీ పడి మరీ నటించారు.

కృష్ణంరాజు నటన మరియు సినీ నిర్మాణమే కాకుండా, జర్నలిస్టుగా కూడా పనిచేశారు, అప్పట్లో ఆయన రాష్ట్ర రెండవ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును కూడా గెలుచుకోవడం విశేషం.


ఇక రాజకీయ రంగంలో కూడా కూడా ఆయన విజయవంతంగా రాణించారు. రాజకీయ నాయకుడిగా ఆయన రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు మరియు ఆయన వాణిజ్యం, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసిన కాలంలో అనేక కమిటీలలో కూడా భాగమయ్యారు. యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన గోహత్య నిషేధ ఉద్యమంలో కృష్ణంరాజు కూడా భాగమయ్యారు.

కాగా కృష్ణంరాజు సినీ కెరీర్ వారసత్వాన్ని ఇప్పుడు బాహుబలిగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను పొందిన ప్రభాస్ మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇక కృష్ణంరాజు గారు ప్రభాస్‌తో కలిసి రెబల్, బిల్లా, రాధే శ్యామ్ మొదలైన పలు చిత్రాల్లో నటించారు. రాధే శ్యామ్‌ చిత్రంలోనే ఆయనకు మనం చివరిసారిగా తెరపై చూశాము.

కృష్ణంరాజు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన తరుణంలో ఆయన కోరికలు కొన్ని నెరవేరకుండానే ఉండిపోయాయి.

కృష్ణంరాజు గారు తన కెరీర్ లో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన భక్త కన్నప్ప సినిమాని ప్రభాస్‌తో రీమేక్ చేయాలనుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూనే ఉంది, ప్రస్తుత తరం ప్రేక్షకులకు ఈ స్క్రిప్ట్‌ని అందించడానికి కొంత మంది రచయితలు స్క్రిప్ట్‌ పై చాలా కసరత్తులు కూడా చేశారు. ఈ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించాలని కూడా ఆయన అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇక ఎప్పటికీ ప్రారంభించలేకపోవడం చాలా బాధాకరం. 



అలాగే "ఛత్రపతి" సినిమాలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రభాస్ డైలాగ్ "ఒక్క అడుగు" టైటిల్‌తో ప్రభాస్ తో పాటు ఇతర స్టార్ హీరోలని కూడా పెట్టి మల్టీ స్టారర్ సినిమా కూడా తీయాలని అనుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో కృష్ణంరాజు గారి బంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కృష్ణంరాజుగారు తన మనవూరి పాండవులను రీమేక్ చేయాలనుకుంటున్నారని అప్పట్లో బలమైన ప్రచారం జరిగింది.

183 సినిమాలు
5 ఫిల్మ్‌ఫేర్‌లు
3 నంది అవార్డులు మరియు చలనచిత్ర సోదరుల నుండి అనేక ఇతర అవార్డులు

11 సెప్టెంబర్ 2022 ఒక మహా మనిషి మనల్ని వదిలి వెళ్ళిన రోజు.

మెగాస్టార్ చిరంజీవి మాటల్లో చెప్పాలంటే.. 
ఒక మహా వృక్షం పడిపోయింది.

Similar Links

0 comments:

Post a Comment