నిన్న కాక మొన్న వచ్చినట్టుంది మనల్ని పలకరించడానికి బంగార్రాజు సినిమా, అప్పుడే సంవత్సరం చివర 18 పేజెస్ అనే సినిమాకి కూడా వచ్చేసాం. కనురెప్ప పాటు లో గడిచిపోయిన ఈ సంవత్సరం లో తమ అదృష్టం పరీక్షించుకోటానికి బోలెడన్ని సినిమాలు వచ్చాయి, కొన్ని మెప్పించాయి, కొన్ని అనుకున్న సందడి చేయలేకపోయాయి. మరి ఈ సంవత్సరంలో వచ్చిన సినిమాల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో చూసేద్దామా.
మొదటిగా పెద్ద సినిమాల సంగతి చూద్దాం. ఈ సంవత్సరం మన పెద్ద సినిమాల జోరు మరి అంతగా లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము. ఎందుకంటే RRR మరియు KGF2 లాంటి సినిమాలు బ్లాక్బస్టర్ హిట్లు ఐతే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వంటి స్టార్ హీరోల చిత్రాలు ఫరవాలేదనిపించాయి. ఇక పోతే రాధే శ్యామ్, ఆచార్య, లాంటి సినిమాలు డిజాస్టర్లు కాగా.. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
సీక్వెల్ సినిమాగా భారీ అంచనాల నడుమ వచ్చిన F3 ఆశించిన స్థాయిలో అలరించలేక ఏబొవ్ యావరేజ్ గా నిలిచింది. ఈ సంవత్సరంలో ఇండస్ట్రీకి అతి పెద్ద దెబ్బ మాత్రం విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ ల లైగర్ యొక్క దారుణమైన ఫలితం అనే చెప్పాలి.
మీడియం బడ్జెట్ సినిమాల సందడి మాత్రం ఈ సంవత్సరం కొంచం తక్కువే అని చెప్పాలి. అంటే సుందరానికి సినిమా కంటెంట్ పరంగా బాగున్నా ప్రేక్షకులను థియేటర్ల వద్దకి రప్పించడంలో విఫలమయింది. బింబిసార సినిమా ఒక రకంగా స్లంప్ లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు మంచి ఊపును తీసుకు రాగా, సీతారామం ఆ జోరుకు తన ఆహ్లాదాన్ని జోడించింది. ఇక సంవత్సరం మొదట్లో బంగార్రాజు ఇండస్ట్రీకి శుభారంభం ఇచ్చింది.
ఐతే మీడియం బడ్జెట్ సినిమాలలో ఫ్లాప్ ల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఖిలాడీ, ఆడాళ్ళు మీకు జోహార్లు, గని, పక్కా కమర్షియల్, ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ, మాచెర్ల నియోజకవర్గం లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అయితే తొలి రోజు కాస్త మిశ్రమ స్పందనతో మొదలయిన ధమాకా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా నిలబడి ఈ సంవత్సరం ఆఖరున ఒక మోత మోగించే హిట్ తో ఈ సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలికింది.
ఇక ఈ సంవత్సరం చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. డిజె టిల్లు తో మొదలైన హిట్ల ప్రయాణం మేజర్, హిట్ 2తో కొనసాగి కార్తికేయ 2 తో ఏకంగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఇక చిన్న సినిమాల్లో కూడా సన్ అఫ్ ఇండియా, విరాట పర్వం, సెబాస్టియన్, రంగ రంగ వైభవంగా లాంటివి మచ్చుక్కి కొన్ని ఫ్లాప్ లు ఉన్నాయి. అలాగే అశోక వనంలో అర్జున కళ్యాణం, సమ్మతమే వంటి సినిమాలు పరవాలేదు అనిపించాయి. మసూద అనే చిన్న సినిమా ఎవరూ ఊహించని విధంగా సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది.
ఇక ఈ సంవత్సరం తెలుగు సినిమాకు డబ్బింగ్ సినిమాల తాకిడి కూడా బాగానే ఉంది. KGF2 , విక్రమ్, సర్దార్, కాంతార లాంటి చిత్రాలు సూపర్ డూపr హిట్లు గా నిలిచాయి. బ్రహ్మస్త్ర, పొన్నియిన్ సెల్వన్,.విక్రాంత్ రోణ వంటి సినిమాలు కూడా బాగానే ప్రభావం చూపాయి. అయితే భేదియా, బనారస్ వంటి సినిమాలు ఎప్పుడు వచ్చాయో తెలీకుండా వెళ్లిపోయాయి.
మొత్తానికి ఎప్పటిలానే టాలీవుడ్ తన ప్రస్తానం మన సొంతింటి ఉగాది పచ్చడి లాగా షడ్రుచుల సమ్మేళనాన్ని పంచింది. వచ్చే సంవత్సరం కూడా ఇదే ఉగాది పచ్చడిలోని తీయదనం ఎక్కువ ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
0 comments:
Post a Comment