గురువులు మనకు చదువు నేర్పిస్తారు...అమ్మా,నాన్నలు సంస్కారం నేర్పిస్తారు...మరి ఒక సత్కవి ఏం నేర్పిస్తాడు?
ఎలా భావన చేయాలో నేర్పిస్తాడు.
అది బాధ అయినా, ఆనందం అయినా, ప్రేమ అయినా...ఆఖరికి వర్షపు చినుకైనా సరే ఎలా చూడవచ్చో, ఎంత అందం వెతకవచ్చో నేర్పిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. జామురాతిరి జాబిలమ్మను చూపుతూ పదాలతో జోల పాడతారు. అనాది రాగం, ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరంచించిన ఆయన కవి ప్రస్థానం నా లాంటి ఎందరికో అడుగడుగునా స్ఫూర్తిదాయకం.
గంగాదేవిని భూమిమీదకు రప్పించిన ఆ భగీరథుడు ఎంత గొప్పవాడో సాహితీ గంగను సినిమా పాటలో ప్రవహింపజేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంతే గొప్ప.
'రివ్యూ రౌడీస్' వారి తరఫున ఆయనను స్మరించుకుంటున్న ఓ ఆత్మీయాభిమానిని.. (ఈశ్వర్ చంద్ర)
సాహసం నా పథం....రాజసం నా రథం సాగితే ఆపటం సాధ్యమా అన్న నవయువకుడు ఆయన.
పౌరుషం ఆయుధం....పోరులో జీవితం కైవసం కావటం కష్టమా అనే విప్లవ కవీ ఆయనే.
వంద ఏళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలనెదుర్కునేందుకు బతికి ఉండగల సాహసానివై పరుగులు తీ...ఉరకలు వెయ్యి అంటూ ఆత్మహత్యలు చేసుకునే యువత గురించి ఆలోచించే మనోవైజ్ఞానిక తత్త్వవేత్త ఆయన.
నువ్వే నడుపు పాదమిది...నువ్వే మీటు నాదమిది...నివాళిగా నా మది నివేదించు నిమిషమిది...వేణుమాధవా నీ సన్నిధీ అనేంత కృష్ణ భక్తిగల ఊతుక్కాడు వేంకట కవీ ఆయనే.
తెలవారదేమో స్వామి...నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు అన్న అభినవ అన్నమాచార్యుడూ ఆయనే.
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది !
విలువేముంది ! అనగలిగే సాహసి అపర భగీరథుడు ఆయనే.
ఏం చెప్పాలన్నా ఆయనే...ఎలా చెప్పాలన్నా ఆయనే...ఎంత చెప్పాలన్నా ఆయనే...ఆయనే సిరివెన్నెల 💫❤️🙏
ఆయనలోని ప్రేమికుడి గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు. కాగితాలు కొరగావు. అనంతమైన ప్రేమ తత్త్వమే ఆయన. ఆయన కలంలో సిరా కాదు ప్రేమను నింపుకుని వ్రాసాడు ప్రతీ ప్రేమ పాటని. తపించాడు ప్రేమ కోసం. రోదించాడు ప్రేమ కోసం. కరిగిపోయాడు ప్రేమ కోసం.
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా పరదాల మంచుపొరలో ఉండగలనా అన్న విఫల ప్రేమికుడు ఆయన.
పెదాల పైన నవ్వుపూత పూసుకున్న నేనే కన్నీటితో ఇవ్వాళ దాన్నెలా చెరపను.. తన జ్ఞాపకమైనా తగదని మనసునెలా మార్చను
ఈ ప్రేమకీ ఏమిటీ వేడుక.... ! ఏ జన్మకీ జంటగా ఉండక...! అంటూ మౌనంగా కన్నీరు కార్చిన ప్రేమ తపస్వి ఆయన.
కన్నీరాభిషేకమా.. నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా ప్రణయమా అంటూ ఆలయంలో అర్చకుడిలా ప్రేమలో దైవత్వాన్ని చూపించింది ఆయనే.
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో.. విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా అంటూ మనసుకే అద్వైతాన్ని చూపించాడు ప్రేమభావనలో.
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే.. ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే.. రేపు లేని చూపు నేనై....శ్వాసలేని ఆశ నేనై మిగలనా అని ఆయన అంటూ ఉంటే స్త్రీ అంతరంగం అర్థమై హృదయం ద్రవిస్తుంది.
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో...మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో....ఆనందం కొనలేని ధనరాశితో అనాధగా మిగిలావే అమావాసలో అంటూ డబ్బు వెనుక పరుగులు పెట్టే క్యాపిటలిస్ట్ సమాజానికి కనువిప్పు కలిగించగలడు ఒక్క క్షణంలో.
నేల మీద మనలాగే ప్రాణులెన్ని ఉన్నా పిలిచేందుకు, పలికేందుకు చుట్టరికాలతో చుట్టుకునేందుకు ఎన్నెన్నో అందమైన వరసలు మనవేలే కన్నా అంటూ బంధుత్వాలు, బంధాల విలువ తెలియజేస్తాడు స్వచ్ఛమైన మనసుతో నవ్వుతూ ఆయన.
మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలూ నిజాల సాక్ష్యాలే.. శత్రువులు నీలోని లోపాలే.. స్నేహితులు నీకున్న ఇష్టాలే.. ఋతువులూ నీ భావ చిత్రాలే అంటూ కొత్తగా మనల్ని మనం ఎలా చూసుకోవాలో పరిచయం చేస్తాడాయన.
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా....కాలం ఇపుడే నను కనగా.. అనగనగా అంటూనే ఉంటా...ఎపుడూ పూర్తవనే అవకా తుదిలేని కథ నేనుగా అంటూ ఎన్నో జన్మలుగా సాగుతున్న జీవుడి ప్రయాణాన్ని చూపిస్తారు.
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా అంటారు ఒక్క మాటలో అన్ని ప్రశ్నలకీ ఆయనే బదులిస్తూ. ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం అనాటమీ ల్యాబ్ లో మనకు మనం దొరకం అంటూ ఆలోచనలో పడేస్తాడు మనల్ని మనం అన్వేషించుకునేలా.
0 comments:
Post a Comment