ఒక శకానికి ముగింపు - మరో శకానికి నాంది

Leave a Comment

 

NTR, ANR, Krishna, Shobhan Babu and Krishnam Raju all passed away

వెండి తెర వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిన ఒక అద్భుత తరం తెలుగు చిత్ర సీమని వదిలి వెళ్లిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు ఇలా కొన్ని వందల చిత్రాలతో ప్రేక్షకులని అలరించి మురిపించిన తారాగణం ఇప్పుడు కేవలం తెరకు మాత్రమే అంకితం అయిపోయింది. వారిని తెర మీద చూసి తనను తాను తెర మీద చూసుకున్నట్లు సంబరపడిన సగటు ప్రేక్షకుడికి తీపి గాయాన్ని మిగిల్చి వీరు వారి తదుపరి ప్రయాణానికి వెళ్లిపోయారు.

ఒకటా రెండా, చెప్పుకుంటూ పోతే రోజులు తరబడి సరిపోవు ఈ నటులు జీవం తెచ్చిన పాత్రలు. పౌరాణికాలకి ఒకరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తే, ప్రేమ సామ్రాట్ గా ఒకరు, డేరింగ్ అండ్ డాషింగ్ గా మరొకరు తన ముద్రని వేస్తే, యువతుల గ్రీకు వీరుడిలా ఒకరు పౌరుషమున్న యువకుడిగా ఇంకొకరు ఇలా వారి వారి హావభావాలతో నటనా ప్రావీణ్యంతో చెరగని ముద్రలు వేసేసారు. కొన్ని వందల సినిమాలతో అలరించిన ఈ దళం కొత్త తరానికి రాజ మార్గం వేశారు. ఇప్పటికీ కొత్త సినిమాలలో వీరి హావభావాలని ఆవిష్కరించటానికి చూస్తున్నారు అంటేనే అర్థం అవుతుంది వారి ప్రభావం తెలుగు చిత్ర పరిశ్రమ మీద ఎంతగా ఉందో.

ఈ హీరోలు కొన్ని తరాలు గుర్తుండిపోయే ముద్రని వేసి సంపాదించిన అభిమానులు నేటికీ వారి కుటుంబాలతోనే కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ సంపాదించిన అభిమానులు నందమూరి అభిమానులుగా బాలకృష్ణ ని, జూనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని ఇలా చాలా మంది హీరోలకి బ్రహ్మరథం పడుతుంటే, ఏఎన్ఆర్ అభిమానులు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా అక్కినేని కుటుంబానికి వెన్నుముక లా ఉన్నారు. కృష్ణ అభిమాన గణం సూపర్ స్టార్ మహేష్ బాబు వెనక ర్యాలీ చేస్తుంటే కృష్ణం రాజు అభిమానులు ప్రభాస్ ని తీసుకెళ్లి టాలీవుడ్ కి రారాజులా కూర్చోపెట్టారు.

నేటి టాప్ 6 గా వెలుగొందే హీరోలు అందరికి ఇలా వారి కుటుంబం లో పెద్ద వేసిన బాటలో నడిచి గెలిచినా వారే, ఇక మీదట కూడా ఈ అభిమాన గణం వీళ్లతోనే ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 

కానీ కాలం ఎవరి కోసం ఆగదుగా. అలానే దానితో పాటు అందరిని పెంచి పెద్ద చేసి ఆఖరికి తనలోనే కలిపేసుకుంది. చివరికి ఎవరికైనా మిగిలేది ఆరు అడుగుల భూమే అంటారు, కానీ ఈ తారలు వారితో పాటు కొన్ని కోట్ల హృదయాల గుండె చప్పుడుని, అభిమానాన్ని, ప్రేమని సంపాదించుకుని చరిత్రలో వారికంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుని కాలం నిలిచినంత లెక్క మేము కూడా నిలిచే ఉంటాం అని వెలుగెత్తి చెప్పారు. కొత్త తరానికి బంగారు బాట వేసి వారు ఆకాశం నుండి చూసి మురిసిపోతున్నారు.


Similar Links

0 comments:

Post a Comment